...

1 views

what's dharma
*ధర్మం అంటే ఏమిటి…?*

*శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు*

_______________________
*ఇహ పర లోకాల్లో సుఖంతోపాటు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఒక్క ధర్మానికే ఉంది. సత్య స్వరూపుడైన పరమాత్మ అనుగ్రహమే ధర్మం. ధర్మాన్ని అనుష్ఠించే వారు ధర్మాత్ములు. అధర్మానికి పాల్పడేవారు పాపాత్ములు. పరమాత్మ మనం చేసే ధర్మ కార్యక్రమాలనే గాక, అధర్మ కార్యక్రమాలనూ గమనిస్తూ, వేటికి ఎలాంటి ఫలాలివ్వాలో, అవి ఇస్తుంటాడు. పరోక్షంగా ధర్మాధర్మాలను పరీక్షించే వాడు పరమాత్మే. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని కాదని, అధర్మానికి పాల్పడితే అది మనల్ని శిక్షిస్తుంది. మనం ధర్మాధర్మాలను తెలుసుకొని వ్యవహరించాలి. అయితే ధర్మానికి దెబ్బ తగిలే పరిస్థితులు ఆయాకాలాల్లో ఉత్పన్నం అవుతాయి. అప్పుడే మహాత్ములు భూమి మీదికి వస్తారని భగవద్గీత చెబుతున్నది.*

*శ్రీకృష్ణుడి నోట వచ్చిన ఈ వాక్కులు అర్థవంతమైనవి. ధర్మానికి హాని కలిగిన ప్పుడు తనను తాను సృష్టించుకుంటానని ఆయన స్వయంగా ప్రకటించాడు. ఇక్కడ తనను తాను సృష్టించుకుంటానని చెప్పిన మాటలను జాగ్రత్తగా పరిశీలించాలి. చాలామంది పండితులు దేవుడు అవతరిస్తాడనే అర్థం చెప్పారు. అవతారం అంటే పైనుంచి కిందికి దిగడం అని అర్థం. ఇక సృష్టించుకోవడం అంటే తనను పుట్టించుకోవడం. కృష్ణుడు తనను తాను సృష్టించుకుంటాను అన్నాడు. అంటే తాను మళ్లీ శరీరధారిని అవుతానని చెప్పడమన్నమాట.*

*సృజనలో ఉన్నది శరీరమే తప్ప, ఆత్మ కాదు. జీవాత్మకు చావు పుట్టుకలు లేవు. అది ఇవ్వాళ ఉండి మర్నాడు పోయేది కాదు. శాశ్వతమైనది.*

*జీవులు తమ కర్మలకు అనుగుణంగా జన్మలను పొందుతారు. అంటే రకరకాల శరీరాలను ధరిస్తారు. ఈ శరీరాలను సృష్టించుకునే శక్తి జీవులకు ఉండదు. పరమాత్మే జీవులకు భోగాన్ని, ఆయువును, జన్మను ఇచ్చేవాడు.*

*మరి శ్రీకృష్ణుడు స్వయంగా తనను సృష్టించుకున్నాడనే మాటకు అర్థం ఏంటి? తానెప్పుడూ ఉన్నవాడే కదా? తనను అంటే ఆత్మను సృష్టించుకోలేడు. ఇక సృష్టించుకోదగింది కేవలం శరీరాన్ని మాత్రమే. అయితే అది అతనికెట్లా సాధ్యమైందో గ్రహించాలి.*

*వైశేషిక దర్శనం శరీరాలను రెండు విధాలుగా పేర్కొంటున్నది. శుక్రశోణితాల మూలంగా పుట్టుక గలవి యోనిజ శరీరాలు. అలా పుట్టనివి అయోనిజాలు.*

*పరమాత్మ సృష్టి విచిత్రమైనది. అది జీవుల కర్మ వైచిత్రి వల్ల ఏర్పడుతుంది. సృష్టి ఆదిలో పరమాత్మ సంకల్పం వల్ల జీవులకు శరీరాలు లభిస్తాయి. ధర్మ విశేషం వల్ల మహర్షుల శరీరాలు, అధర్మ సహితం వల్ల చీమ, దోమ వంటి శరీరాలు, ధర్మాధర్మాలకు పాల్పడటం వల్ల పశ్వాదుల శరీరాలు ఏర్పడతాయి.*

*పరమాత్మ సంకల్పం వల్ల మహర్షుల శరీరాలు సిద్ధిస్తే, యోగసిద్ధి వల్ల ముక్తజీవులు స్వయంగా శరీరాలు సిద్ధింపజేసుకోవడం సృష్టి వైచిత్రికి చక్కని ఉదాహరణ.*

*జీవులకు మోక్షం యోగ మార్గం ద్వారానే సిద్ధిస్తుంది. వారు జీవించి ఉండగానే మోక్షానికి అర్హత సంపాదించుకుంటారు. అందుకే భీష్ముని లాగా ఎప్పుడంటే అప్పుడు శరీరాలను విడువడానికి కూడా సంసిద్ధులు అవుతారు. యోగులకు తమ శరీరాలను విడిచిపెట్టగల సామర్థ్యమే కాదు, మరొక సామర్థ్యమూ ఉంది. అదే తమ శరీరాలను తాము సృష్టించుకునే ఏర్పాటు.*

*శ్రీకృష్ణుడు తనను తాను సృష్టించుకుంటానని చెప్పిన మాటల అంతరార్థం ఇదే!*

*పుణ్యాత్ములైన యోగ పురుషులు మానవలోకం ధర్మభ్రష్టం అవుతుంటే చూస్తూ ఊరుకోరు. కనుకనే తమను తాము సృష్టించుకొని శరీరధారులై భూమికి వస్తుంటారు. అదే అవతారం. అంతేగాని పరమాత్మ ఎన్నడూ అవతరించడు. అతడు అజుడు. జీవి మాత్రమే జన్మ ఎత్తగలడు.*

*శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు. తన యోగశక్తితో పూర్వం తానెత్తిన జన్మలను గూర్చి సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు. ఆయన ఏ యుగంలో అయినా రాగలడు, ధర్మాన్ని రక్షించగలడు.*

© director.gopikiran